కవితాత్మకమైన భావాలు జీవితంలో మనం ఇంకా దర్శించని కొన్ని కొన్ని లోతులని మనకి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మామూలుగా చూస్తే ఇదే సూర్యుడు.
రోజూ ఉదయిస్తూ ఉంటాడు,మధ్యాహ్నం విపరీతమైన వేడిని వెదజల్లుతూ "వెధవ ఎండ,భరించలేకపోతున్నాం " అని మనం అనుకునేలా ప్రవర్తిస్తూ ఉంటాడు,మళ్ళీ సాయంత్రం పూట ఏదో పనిఉన్నవాడిలా అస్తమిస్తూ పోతూ ఉంటాడు.ఈ సూర్యోదయ,సూర్యాస్తమయ కాలాల మధ్యలో సూర్యుని తాలూకు సౌందర్యాన్ని ఎప్పుడైనా దర్శించామా?
అన్నమాచార్యులు ఎంత బాగా మనకా సౌందర్యాన్ని దర్శింప చేస్తున్నడోచూడండి ఈకీర్తనలో...
" శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ
పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ
ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ
గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ
మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ
మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ
గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ "
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ "
No comments:
Post a Comment