Invictus..'ఇన్విక్టస్' ఇంగ్లీష్ మూవీ
ఈ రోజు ఒక మంచి 'ఇన్విక్టస్' ఇంగ్లీష్ మూవీ చూసాము పిల్లలతో కలసి దీనికి ప్రేరణ మాత్రం మా మిత్ర శ్రేష్ఠులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారే, ఇన్విక్టస్ అంటే అజేయుడు, అపరాజితుడు అని అర్ధం తీసుకోవచ్చు ఈ సినిమా గురించి వారు చెప్పిన మాటలే "Invictus (2009)క్లింట్ ఈస్ట్ వుడ్ నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా. నెల్సన్ మండేలా (1918-2013)జీవితంలోని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఈ సినిమాలో ఇతివృత్తం చాలా సరళం. మండేలా దక్షిణాఫ్రికాకి ప్రజాస్వామికంగా తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటప్పటికి, దక్షిణాఫ్రికా చరిత్ర ఆ కొత్త జాతీయరాజ్యాన్ని భయపెడుతూ ఉంది. గత అనుభవాల వల్ల, కొన్ని శతాబ్దాలుగా శ్వేతజాతీయులు పాటించిన వర్ణవివక్షవల్ల నల్లజాతివాళ్ళు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నారు. పొరుగు ఆఫ్రికా దేశాల్లో, మొజాంబిక్, జింబాబ్వేల్లో సంభవించినట్టుగా తమమీద కూడా ఊచకోత మొదలవుతుందని తెల్లవాళ్ళు భయభ్రాంతులై ఉన్నారు. విమోచన పొందిన వెంటనే తక్కిన ఆఫ్రికా దేశాల్లో జరిగినట్టే దక్షిణాఫ్రికా లో కూడా అంతర్యుద్ధం సంభవించకతప్పదనే ప్రపంచమంతా భావిస్తూ ఉన్న సమయం.
శ్వేతజాతి ఒక నల్లవాడిమీద చెయ్యగల అత్యాచారానికి మండేలా ఒక పూర్తి ఉదాహరణ. 27 సంవత్సరాల తరుణజీవితాన్ని చిన్న జైలుగదిలో గడపవలసివచ్చిన అనుభవం అతడిది. అందుకతడు ఎటువంటి ప్రతీకారం తీర్చుకున్నా ఎవరూ అతడిని తప్పుపట్టలేరు. కాని సరిగ్గా ఆ క్షణంలోనే, ఆ కీలక ఘట్టంలోనే తన దేశమొక ఇంద్రచాపదేశం కావాలనీ, నల్లవాళ్ళూ,తెల్లవాళ్ళూ అన్న భేదం లేకుండా, దక్షిణాఫ్రికా అనే ఒక నవజాతీయరాజ్యం అవతరించాలనీ మండేలా కోరుకున్నాడు. అందుకు గతాన్ని మర్చిపోవడమొక్కటే మార్గమని నమ్మాడు. నిన్నటిదాక తన శత్రువుగా ఉన్న మనిషిని క్షమిస్తే తప్ప నేడతడు తన సోదరుడిగా మారడనీ, క్రీస్తు చెప్పిన reconciliation నిజంగా ఆచరణలో పెట్టవలసిన సమయమొచ్చిందనీ ఆయన విశ్వసించాడు.
అటువంటి సమయంలో తనకి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అట్లాంటి ఒక అవకాశాల్లో 1995 లో జరిగిన ప్రపంచ కప్ రగ్బీ మాచ్ కూడ ఒకటి. రగ్బీ ఆట ద్వారా ఆయన కేవలం ఒక రాజకీయ పరిష్కారమే కాదు, సినిమాలో తన కార్యదర్శి బ్రెందా తో చెప్పినట్టుగా 'ఒక మానవీయ పరిష్కారాన్ని 'కూడా రాబట్టాడాయన.
సినిమా చూస్తున్నంతసేపూ మనకి గాంధీ, అబ్రహాం లింకన్ వంటి నాయకులు గుర్తొస్తూ ఉంటారు.కాని మరో విషయం కూడా స్ఫురిస్తూ ఉంటుంది. లింకన్ అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయాడు. గాంధీజీ దేశవిభజనని నివారించలేకపోయాడు. కాని మండేలా అవిభక్త దక్షిణాఫ్రికాని సాధించగలిగాడు, నిలబెట్టగలిగాడు. ఈ సాఫల్యం బహుశా కాలగతిలో మానవజాతి సాధించుకోగలిగిన మానసిక పరిణతి అనుకోవలసి ఉంటుంది.
మనం జాతి, మత, వర్గ, ప్రాంత, లింగ వివక్షలతో ఎంత వికృతంగా కృతిమంగా ఆలోచిస్తున్నామో, భావి తరాలకు ఎలా నూరిపోస్తున్నమో ఎదుగుతున్నామనుకుంటూ...దిగజారి పోతున్నామో ఆలోచన రేకెత్తించే, అణువణువునా స్ఫూర్తి కలిగించే ఇటువంటి సినిమాలు అన్ని దేశాల్లో కధాంశాలు గా రావాలి. చాలా మంచి సినిమా గురించి పోస్ట్ రాసిన మిత్ర శ్రేష్ఠులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారికి ధన్యవాదాలతో...మణి సాయి, వైభవ్, ప్రభవ్ విస్సా,
No comments:
Post a Comment