Friday, April 10, 2015

తొమ్మిద అంతర్జాతీయ రచయితల ఉత్సవం ప్రారంభోత్సవ సభలో కీలకోపన్యాసం

నిన్న నెల్లూరులో కాఫ్లా ఇంటర్ కాంటినెంటల్ వారు నిర్వహించిన తొమ్మిద అంతర్జాతీయ రచయితల ఉత్సవం ప్రారంభోత్సవ సభలో కీలకోపన్యాసం చెయ్యవలసిందిగా నన్ను ఆహ్వానించారు. ఆ ప్రసంగ పాఠం:
సరస్వతికి నమస్సులు, సభాకల్పతరువుకి నమస్సులు,వేదికమీద ఆసీనులైన పెద్దలకి నమస్సులు.కఫ్లా ఇంటర్ కాంటినెంటల్ వారు నిర్వహిస్తున్న తొమ్మిదవ అంతర్జాతీయ రచయితల ఉత్సవానికి దేశవిదేశాలనుంచి ఇక్కడకు హాజరైన కవులకీ, రచయితలకీ నా నమస్సులు, నా ఆహ్వానం.
మీరొక విశిష్టమైన నేలమీద, ఒక పురాతనమైన పట్టణంలో అడుగుపెట్టారు. తెలుగు భారతీయభాషల్లోనే కాదు, ప్రపంచ భాషల్లోనే ఎంతో విశిష్టమైన, ప్రత్యేకమైన భాష. ఎత్నోలాగ్.కాం వారి లెక్కలప్రకారం తెలుగు ప్రపంచభాషల్లో 13వ స్థానంలో ఉంది. మా భాషకి వెయ్యేళ్ళ లిఖిత సాహిత్యమూ, రెండువేల ఏళ్ళకు పైగా మౌఖిక సాహిత్యమూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లమంది మా భాష మాట్లాడుతున్నారు.
తెలుగుసాహిత్యం వికసిస్తున్న తొలిదశలోనే నెల్లూరు గొప్ప పాత్ర పోషించింది. మా తొలిమహాకవుల్లో ఒకరైన తిక్కన మా భాషకీ, జాతికీ ఒక సంస్కారాన్ని అలవర్చిన మహనీయుడు. మేమాయన్ని కవిబ్రహ్మ అని పిలుస్తాం. అంటే ఆయన మా కోసమొక ప్రపంచాన్ని సృష్టించాడన్నమాట. అటువంటి చారిత్రాత్మక స్థలంలో మనమీనాడు సమావేశం కావడం నాకెంతో సంతోషాన్నిస్తున్నది.
ఈ నాటి మన ఉత్సవానికి సూత్రవాక్యంగా వసుధైక కుటుంబకం అనే మాటని వాడుతున్నాం. ఈ మాట మొదటిసారి పంచతంత్రకారుడు వాడాడు. ఆయన చెప్పిన శ్లోకం ఇలా ఉంది:
అయం నిజ: పరోవేతి గణనా లఘుచేతసాం
ఉదారచరితానాంతు వసుధైకకుటుంబకం
ఇతడు నావాడాడు, ఇతడు పరాయివాడు అనుకోవడం చిన్నమనస్కుల లక్షణం. ఉదారచరితులకి వసుధ అంతా ఒకటే కుటుంబమని దాని అర్థం. పంచతంత్ర కర్త రెండు ప్రత్యేకమైన శబ్దాలు వాడాడు. లఘుచేతసులూ, ఉదారచరితులూ అని. రెండూ పరస్పరం వ్యతిరేకపదాలు కావు. లఘుచేతసులకి , గురుచేతసులు వ్యతిరేకపదం. కాని కేవలం గురు చేతస్కులైతే సరిపోదు. వాళ్ళు ఉదారచరితులై ఉండాలి. చరిత అంటే నడవడిక. వాళ్ళ ఆచరణలో ఆ ఔదార్యం ప్రతిఫలించాలి. అటువంటివాళ్ళకి మాత్రమే వసుధ ఏకకుటుంబకమవుతుంది.
ఇప్పుడు మనమొక పోస్ట్ మోడర్న్ సందర్భంలో ఉన్నాం. రెండున్నరవేల ఏళ్ళ యూరోప్ తత్త్వశాస్త్ర చరిత్రని పరిశీలిస్తే అది నిన్నమొన్నటిదాకా 'సెల్ఫ్ ' గురించిన విచారణలోనే కూరుకుపోయిందని మనకు అర్థమవుతుంది. తనలో తాను కూరుకుపోయిన సెల్ఫ్ కి ‘అదర్’ఒకటుంటుందని తెలియదు. తెలిసినా అది అదర్ ని చూసి భయపడుతుంది. అదర్ అంటే ఇతరుడు తనలా ఉండడు కాబట్టి,కొత్తగా, వింతగా, అపరిచితుడిగా ఉంటాడు కాబట్టి అదర్ సెల్ఫ్ కి ఎప్పటీకీ భయకారకమే. నేడు ప్రపంచాన్నంతటినీ కమ్మిన హింసావిద్వేషాలకి కారణం అదర్ గురించి సెల్ఫ్ కి ఏర్పడుతున్న భయంలోంచి పుట్టిపెరుగుతున్నవే. ఇతరుడిపట్ల ఏర్పడుతున్న ఈ భయాన్నుంచి బయటపడటానికి సెల్ఫ్ ఎప్పుడూ రెండు మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఒకటి, అదర్ ని నిర్మూలించడం, లేదా తనలాగా మార్చెయ్యడం. రెండూ కూడా దుర్మార్గాలే. ఎందుకంటే ఇతరుడు లేకపోయినా, ఇతరుడు కూడా తనలాగే మారిపోయినా ప్రపంచం తన సౌందర్యాన్ని పోగొట్టుకుంటుంది. యాంత్రికంగా మారిపోతుంది.ఇతరుడు నీలా లేడుకాబట్టే సృష్టి అద్భుతంగానూ, కొత్తగానూ, ఊరించేదిగానూ ఉంది. నువ్వూ, నీ పక్కవాడూ కూడా ఒక్కలానే ఆలోచిస్తే, ఒక్కలానే మాటాడితే ఈ ప్రపంచమొక కీలుబొమ్మలాటగా మారిపోతుంది. అలాగని ఇతరుడూ, నువ్వు పూర్తిగా వేరు వేరైనా కూడా ప్రపంచం శోభావహంగా ఉండదు. అప్పుడు మనం ఒకరికొకరం అర్థం కాకుండా పోతాం. మానవజీవితంలోని విశేషం మనుషులు ఒకరికొకరు పూర్తిగా ఐడెంటికల్ గా కాని పూర్తిగా డిఫరెంట్ గా కాని లేకపోవడంలోనే ఉంది. మనుషులు ఏకకాలంలో ఐడెంటికల్ గానూ, అదేసమయంలో డిఫరెంట్ గానూ ఉంటూనే సామనస్యంతో జీవించడమెట్లానో పురాతన భారతీయ సమాజం ఊహించడానికి ప్రయత్నించింది.ఆ ప్రయత్నంలోనే కుటుంబానికి రూపురేఖలు దిద్దడానికి ప్రయత్నించింది. మనుషులు తమ ఐడెంటిటీని, తమ డిఫరెన్సునీ కూడా నిలుపుకుంటూనే సామరస్యంతో జీవించగలిగే చోటు కుటుంబంలోనే సాధ్యం. అటువంటి సామరస్యమెలా ఉంటుందో అధర్వవేదం ఇలా ప్రస్తుతించింది:
సహృదయం, సాంమనస్యం, ద్వేషంనుంచి
విముక్తికోసం నేనీ కర్మకు పూనుకున్నాను
అప్పుడే పుట్టిన లేగను ఆదుకునే గోవులాగా
మీరొకరినొకరు ప్రేమించుకోవాలని కోరిక
పుత్రుడు తండ్రికి విధేయుడై వుండాలి
తల్లి బిడ్డలతో ఏకమనస్క కావాలి
భార్యభర్తతో మాటాడే మాటల్లో
తేనె పొంగాలి, శాంతి చిమ్మాలి
సోదరుడు సోదరుణ్ణి ద్వేషించకుండుగాక,
సోదరి సోదరిని. సోదరులంతా
ఏకగ్రీవంగా, ఏకోన్ముఖంగా
స్నేహంగా మాట్లాడుకోవాలి.
ఏ మంత్రం దేవతల్ని కలిపిఉంచుతున్నదో
పరస్పర ద్వేషాన్ని దూరం చేస్తున్నదో
ఆ ప్రార్థనని ఈ ఇంట్లో ప్రవేశపెడుతున్నాను
కలిసిమెలసి జీవించండి.
విడిపోకండి ఎన్నటికీ-కలిసి పనిచెయ్యండి
సమానమనస్కులుగా సత్కార్యాలు చెయ్యండి
మంచి మాటలు మాటాడుకోండి
మంచి పనులు చెయ్యండని ఆదేశిస్తున్నాను
మీ అన్నపానీయాలు కలిసి పంచుకోండి
ఒకటే కార్యభారానికి కట్టుబడండి
చక్రంనాభిచుట్టూ ఆకుల్లాగా
ఇంట్లో అగ్నిచుట్టూ మీ జీవితాలు అల్లుకోండి
అమృతాన్ని రక్షించుకుంటున్న దేవతల్లాగా
మిమ్మల్ని ఒక్క నాయకుడికింద
ఒక్కతాటిమీద నడిపిస్తాను,సాయంప్రాతస్సంధ్యలు
మీ మనసులు కల్యాణకరాలు కావాలి.
ఎన్నో ఏళ్ళకిందట వైదిక ఋషి కోరుకున్న ఈ సాంమనస్యమే ప్రపంచమంతా ఒక కుటుంబం కావాలన్న కోరికకి నాంది. నేను మా ఊళ్ళో నా తల్లిదండ్రుల కుటుంబమే నా కుటుంబమని అనుకోలేకపోయాను. ఇప్పుడు హైదరాబాదులో మెహిదీపట్నంలో ఒక కప్పుకింద నేనెవరితో కలిసి జీవిస్తున్నానో వారికే నా కుటుంబం పరిమితమని అనుకోలేకపోతున్నాను. ఈ ప్రపంచమంతా, నానా జాతులవాళ్ళు,నానా భాషలు మాట్లాడేవాళ్ళంతా నావాళ్ళనుకోవడంలో నాకెంతో సంతోషం. దక్షిణాఫ్రికానుంచి వచ్చిన కవి జాకొబ్ ఇసాక్ ఇప్పుడు వేదికమీద అడుగుపెడుతున్నప్పుడు నేను కేవలం జాకబ్ ని మాత్రమే చూడలేదు. సాక్షాతూ నదిం గార్డిమర్ ఇక్కడికి వచ్చినట్టనిపించింది నాకు. బ్రేటన్ బ్రేటన్ బాక్ కవిత సాకారమై ఇక్కడ అడుగుపెట్టినట్టనిపించింది. ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన కవి అస్రార్ అల్లాయరోవ్ ని మీరిక్కడికి పిలిచినప్పుడు సమర్ఖండ్ సిల్కుదారుల జ్ఞాపకాలగాలి నామీంచి వీచినట్టే భావించాను. ఈ కవులు నాకు పరాయివాళ్ళుగా తోచలేదు. మేమంతా, మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, ఏ సెలవులకో మన స్వగృహంలో కలుసుకున్నట్టేఉంది నాకు . దీన్నే వైదిక ఋషి సాంమనస్యం అన్నాడు. వసుధ ఏకకుటుంబకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సంతోషం సాధ్యమవుతుంది.
ఈ రెండు రోజులూ మీరెన్నో విషయాలమిద మాట్లాడుకోవాలనుకుంటున్నారు. ఒకరి గురించి మరొకరికి మనసు విప్పి చెప్పుకోవాలనుకుంటున్నారు. ఒకరి భాషగురించి, ఆ భాషలోని మహనీయకవిత్వాలగురించి, రచనల గురించి మరొకరికి చెప్పుకోవడంలో ఉండే అద్వితీయ ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నారు. తాళ్ళపాక అన్నమయ్య నుంచి చినువా అచెబె దాకా, వీరశైవవచనకవులనుండి కరిబియన్ కవిత్వందాకా, బావుల్ భిక్షులు మొదలుకుని రామచరితమానస్ దాకా ఎందరో కవులు, ఎన్నో కవిత్వాలు. మాట్లాడుకోండి,తనివితీరా, కరువుతీరా మాట్లాడుకోండి. ఆ పేర్లు విన్నప్పుడు నాలోనూ ఎన్నో ఆనందప్రకంపనలు. వాళ్ళంతా నా సొంత మనుషులే. చినువా అచెబె నవలలు చదువుతున్నప్పుడు నాకు నైజీరియాలోని ఇగ్బొ తెగగురించి చదువుతున్నట్టు అనిపించలేదు. అది మా తూర్పుగోదావరి అడవుల్లో కొండరెడ్ల గురించి చదువుతున్నట్టే ఉంది. కరిబియన్ చెరుకుతోటల్లో నేను కూడా శ్రామికులతొ కలిసి చెరుకు గానుగ ఆడుతున్నట్టే ఉంటుంది. బహుశా రచయితలే లేకపోతే, కవులే లేకపోతే, ఈ వసుధ ఏకకుటుంబం కావాలన్న కోరిక మనలో ఎవరు రగిలించగలిగిఉండేవారు!
మాట మహిమాన్వితమైనది. ఒక తెలుగు కవి అన్నట్లుగా అది మన అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేస్తుంది. అందుకనే వైదిక ఋషి తన మాట 'భర్గస్వతీ వాక్కు ' కావాలని కోరుకున్నాడు. భర్గ అంటే గాయత్రీమంత్రం ప్రస్తుతించిన దేవస్య భర్గ:. భర్గ అనే మాట భృజ్ ధాతువునుంచి వచ్చింది. అపారమైన వెలుగు, ప్రకాశం, ఉజ్జ్వల కాంతి అని దానికి అర్థం. మనం మాట్లాడితే ఆ మాటలు భర్గస్వంతం కావాలి. మహోజ్జ్వలంగా ప్రకాశించాలి. ఒక వెలుగు వెలగాలి.
దాన్నే మా ఆధునిక మహాకవి గురజాడ 'మాటలనియెడు మంత్రమహిమ ' అన్నాడు. ఆయనిలా అన్నాడు:
చూడు మును మును మేటివారల
మాటలనియెడు మంత్ర మహిమను
జాతిబంధములన్న గొలుసులు
జారి సంపదలుబ్బెడున్
యెల్లలోకములొక్క యిల్లై
వర్ణభేదములెల్ల కల్లై
వేలనెరుగని ప్రేమబంధము
వేడుకలు కురియన్.
‘యెల్లలోకములొక్క ఇల్లు ‘ అంటున్నప్పుడు ఆయన వసుధైకకుటుంబకమనే ఆ పురాతన భారతీయ స్వప్నాన్నే మరోమారు పునరుద్ఘాటిస్తున్నాడు. నేడు ఆ కలని నిజం చేయడానికి ఇక్కడ చేరుకున్న మీకందరికీ మరోమారు నా శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు.

No comments:

Post a Comment

Total Pageviews