నిన్న గాంధీ జయంతి నాడు, వనమాలి సంస్థ ప్రచురించిన 'సాదత్ హసన్ మంటో కథలు ' పుస్క్తకావిష్కరణ జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు, సామాజికకార్యకర్త, వక్త దేవి అనువాదం చేసిన కథలు.
ఆ సమావేశానికి ‘అంకురం’ దర్శకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆర్.టి.సి మేనేజింగ్ డైరక్టర్, సీనియర్ పోలీస్ అధికారి ఎ.కె.ఖాన్ ముఖ్య అతిథిగా పుస్తకాన్ని ఆవిష్కరించి మంటో గురించి మాట్లాడేరు. ఆ కథల్ని పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించడంతో నేను కూడా ఆ సమావేశంలో పాల్గొని మాట్లాడేను.
దేవి గారు మంటో దేశవిభజన నేపథ్యంగా రాసిన కథల్లో పదకొండింటినీ, ఇరవైతొమ్మిది గల్పికల్నీ అనువాదం చేసారు. నేరుగా ఉర్దూనించి చేసిన అనువాదాలు. చాలా విలువైన కృషి.
భారత ఉపఖండ కథానిక ప్రక్రియలో సర్వశ్రేష్ట కళాకారుడని సల్మన్ రష్డీ ప్రశంసించిన సాదత్ హసన్ మంటో (1912-1955)ని ఇటు భారతదేశమూ, అటు పాకిస్తానూ కూడా పోగొట్టుకున్నాయి. గత గత ఏడాది ఆయన శతజయంతి అన్న విషయమే ఎవరికీ పట్టలేదు. కాని ప్రధానస్రవంతి సాహిత్యచరిత్రకారుల్ని నిర్ఘాంతపరుస్తూ మంటో రోజురోజుకీ ప్రపంచమంతటా సాహిత్యాభిమానుల్ని సమ్మోహపరుస్తూనే ఉన్నాడు.
మంటో పంజాబ్ లో సమ్రాలా లో పుట్టాడు. తండ్రికి రెండవభార్య సంతానం. తండ్రంటే భయం. ఉర్దూ సాహిత్యానికి అంతర్జాతీయ ప్రశస్తి సాధించిన ఈ రచయిత చిన్నప్పుడు ఉర్దూలో రెండుసార్లు తప్పాడు. నవయవ్వన దశలో అందరు పిల్లల్లానే అవకతవక జీవితంలోకి అడుగుపెడుతున్నప్పుడు బరీ ఆలీ అనే పత్రికా రచయిత దృష్టిలో పడ్డాడు. 'ఆయన పరిచయం కాకపోయుంటే రచయితను కాకుండా క్రిమినల్ ని అయ్యుండేవాడిన ' ని రాసుకున్నాడొకచోట. విక్టర్ హ్యూగో రచనని అనువదించడంతో సాహిత్యజీవితం మొదలయ్యింది. ఆ కాలంలో ప్రపంచ సాహిత్యమంతా విస్తారంగా చదివాడు. కాని అందరికన్నా అతడి హృదయాన్ని మపాసా, గోర్కీ ఎక్కువ కట్టిపడేసారు.
కొన్నాళ్ళు ఆలీఘర్ ముస్లిం యూనివెర్సిటీలో చదువుకోవాలనుకున్నాడు కానీ, చదువు సాగలేదు. కొన్నాళ్ళు కాశ్మీర్ లో గడిపాడు. కాశ్మీర్ అతడి జీవితపు తొలివలపూ, తుదివలపూ కూడా. కొన్నాళ్ళు అమృతసర్ లో . చివరకి 1936 లో బొంబాయిలో అడుగుపెట్టాడు. బొంబాయిలో అతడి జీవితం రెండు దశల్లో సాగింది. 1936 నుంచి 41 దాకా. మళ్ళా 42 నుంచి చివరగా అతడు 148 లో లాహోర్ వెళ్ళిపోయినదాకా. బహుశా అతడి జీవితంలో అత్యంత విలువైన దశ అతడి బొంబాయి కాలమనే చెప్పవలసిఉంటుంది. అతడి 'బాంబే స్టోరీస్ ' (2012) ని ఇంగ్లీషులో కి అనువాదం చేసిన మాట్ రీక్, అఫ్తాబ్ అహ్మద్ లు ఆ పుస్తకానికి రాసిన విపులమైన ముందుమాటలో మంటో బొంబాయి జీవితం గురించీ, అది అతడి కథల మీద చూపించిన ప్రభావం గురించీ వివరంగా చెప్పుకొచ్చారు.
మంటో కథల మరొక ఇంగ్లీషు అనువాదకుడు ఆతిష్ తాసిర్ తన పుస్తకం 'మంటో సెలెక్టెడ్ షార్ట్ స్టోరీస్ " (వింటేజ్, 2012) కు రాసుకున్న ముందుమాటలో ఇలా రాసాడు:
‘రచయితలెప్పుడూ జాతీయరచయితలు కావాలనుకుని రచనలు చెయ్యరు. వాళ్ళకి చిన్న ప్రపంచాలు, ఎంతో అత్మీయప్రపంచాలు, అన్ని వివరాలూ బాగా దగ్గరగా తెలిసిన ప్రపంచాలు కావాలి. పెద్దపెద్ద దేశాలు, మరీ ముఖ్యంగా భారతదేశంలాగా విస్తృతంగానూ, వైవిధ్యంతోనూ ఉండే దేశాలు వాళ్ళకి నేరుగా సాహిత్యసామగ్రి కాలేవు. నగరాలూ, వాటిఇరుగూపొరుగూ, ఒక్కొక్కప్పుడు ఒక్క వీధి మాత్రమే, అది కూడా పెద్ద భవంతిలో కొట్టొచ్చినట్టు కనబడే విషయంలాగా వాళ్ళకి ద్యోతకమవుతాయి. జాయిస్ కి డబ్లిన్ లాగా, బెల్లో కి చికాగో లాగా, బొంబాయి అటువంటి నగరం మంటోకి. అతడు భారతీయ రచయితా కాదు, పాకిస్తానీ రచయితా కాదు, బొంబాయి రచయిత. బహుశా భారతదేశం కన్నా కూడా ముందు బొంబాయి తన రచయితను గుర్తుతెచ్చుకోవలసి ఉంటుంది.'
బొంబాయి సినిమా ప్రపంచంలో కుదురుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్న మంటో ప్రయత్నాలు ఒక్కటి కూడా కలిసి రాలేదు. ఆ రోజుల్లోనే లక్నోలో మొదటి ప్రగతిశీల రచయితల సమ్మేళనం జరిగింది. భారతీయ అభ్యుదయ సాహిత్య ప్రవక్తలైన ప్రేం చంద్, సజ్జాద్ జాహిర్, కిషన్ చందర్, ముల్క్ రాజ్ ఆనంద్, ఇస్మత్ చుగ్తాయి వంటి రచయితలందరికీ మంటో సమకాలికుడు.కొందరికి చాలా సన్నిహితుడు.
ఈ లోగా దేశానికి స్వాతంత్ర్యం రావడం,దేశ విభజనా సంభవించాయి. మంటో పాకిస్తాన్ లో తనకొక భవిష్యత్తు ఉందనుకున్నాడు. 1948 లో బొంబాయి వదిలి లాహోర్ వెళ్ళి , 1955 లో మరణించేదాకా, అతడు పాకిస్తాన్ లోనే గడిపినప్పటికీ, అక్కడ మానసికంగా ఇమడలేకపోయాడు. పైగా అయిదు సార్లు తన కథలమీద న్యాయస్థానాల్లో విచారణ నడిచింది. మూడు సార్లు కింద కోర్టులు ఆ అభియోగాల్ని కొట్టేసాయి. ఒకసారి జరిమానా పడింది. మరొకసారి ఆరోగ్యం బాగులేక విచారణకు హాజరు కాలేకపోయాడు. అతణ్ణి విచారించింది కేవలం కోర్టులు మాత్రమే కాదు. సన్నిహితమిత్రులూ, అభ్యుదయ రచయితలూ కూడా అతణ్ణి విమర్శించడంలో తక్కువతినలేదు. ఆ విమర్శలూ, అభియోగాలూ, విచారణలూ అతణ్ణెంత కుంగదీసాయంటే, తనొక రచయితకావడం కన్నా నల్లబజారు వ్యాపారిగానో, దొంగసారా కాచుకునేవాడిగానో బతికిఉంటే బాగుణ్ణనుకున్నాడు. చివరికి తాగుడుకి బానిసగా, భగ్నహృదయంతో అకాలమరణం చెందాడు.
ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆరుదశాబ్దాలు గడిచాకమళ్ళా పునర్జన్మించడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఏ కథల వల్ల, ఏ కథనం వల్ల అతణ్ణి సమకాలిక సమాజం అభిశంసించిందో ఆ కథాలవల్లా ఆ కథనం వల్లా మాత్రమే అతడిప్పుడు మనకెంతో ప్రీతిపాత్రుడవుతున్నాడు. ఉదాహరణకి అతడి బొంబాయి కథల్లో ఒక కథ 'స్మెల్ ' ని చదివి అభ్యుదయ రచయిత సజ్జాద్ జాహిర్ అందులో సమాజానికి పనికివచ్చే సందేశమేదీ లేదని విమర్శించాడు. కాని నేను చదివిన ప్రపంచకథల్లో అంత అత్యంత కవితాత్మకమైన కథ మరొకటి గుర్తురావడం లేదు. మానవ దేహాలపట్లా, మనసుల పట్లా మనుషులు లోనుకాగల ఆకలిదప్పుల గురించి తెలిసినవాడు మాత్రమే అట్లాంటి కథ రాయగలడు.
దేశవిభజనసమయంలో కనవచ్చిన దారుణమైన అమానుషత్వం గురించీ, విషాదం గురించీ మంటో ఎంత రాయగలడో అంత రాసాడు. దేవి గారు అనువదించిన కథలు ప్రధానంగా దేశవిభజన నేపథ్యంగా మంటో రాసిన కథలే. వాటిని కేవలం కథలుగా చూడలేం. అవి భారతదేశ చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని ఉన్నదున్నట్టుగా నమోదు చేసిన నివేదికలు. ఆ కథలు చదివిన తరువాత మనం మామూలుగా మన దైనందిన జీవితంలోకి పోలేం. ఆ రచనలకి ఒక physicality ఉంది. నా మటుకు నేను ఆ అనువాదాలు చదివిన తరువాత చాలాసేపు నిస్త్రాణగా మంచం మీద వాలిపోయాను.
అయితే రచయితగా మంటో ప్రతిభ కేవలం దేశవిభజన దారుణాన్ని చిత్రించడంలోనే లేదు. బొంబాయి జీవితాన్ని చిత్రించినా, విభజనసమయపు హత్యలు, మానభంగాలూ, దోపిడీ, దుర్మార్గాల్ని చిత్రించినా మంటో చూపిస్తున్నది జీవితం పట్ల తనకుండే ఆకలిదప్పుల్నే. జీవించడం పట్ల అంత ఆబనీ, వ్యామోహాన్నీ చూపించగలిగే శక్తి అతడు మపాసా నుంచీ, గోర్కీనుంచే తెచ్చుకున్నాడనాలి.
ఇప్పటికే మంటో ప్రపంచాన్నీ, భారత ఉపఖండాన్నీ మళ్ళా ఒక కుదుపు కుదపడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవి గారి అనువాదంతో తెలుగు పాఠకులు కూడా ఆ కుదుపునుంచి తప్పించుకోలేరు.
No comments:
Post a Comment